తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,271 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,018 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3, 78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
9న జాబ్‌మేళా
తిరుపతి అర్బన్: పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమ వారం ఆయన కలెక్టరేట్‌లో జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీసిటితోపాటు 12 బహుళజాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదువుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం పాల్గొన్నారు.


