శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని జగ్గరాజుపల్లి పంచాయతీ పరిధిలో తిరుపతికి చెందిన కొందరు వ్యక్తులు శ్రీనివాస్ గార్డెన్ పేరుతో ఒక వెంచర్ వేశారు. ఆ వెంచర్‌కు ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించారని మంగళవారం గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నంబర్లు 107–1, 108–1,2,3, 282–20, 280, 282, 283 ఉన్న ఈ ప్రభుత్వ భూములను తిరుపతికి చెందిన శ్రీనివాసా గార్డెన్‌న్స్ ప్లాట్లుగా మార్చి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించారని తెలిపారు. అధికారులు సర్వే చేసి, ఆక్రమణలను తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. వ్యాపారులు ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతో ఎస్సీ, ఎస్టీలైన తమకు జానెడు జాగా దొరకడం కష్టతరంగా మారిందని వారు వాపోయారు. మంగళవారం గ్రామస్తులు మండల తహసీల్దార్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత మృతి
సూళ్లూరుపేట రూరల్: మండలంలోని ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారి పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ (45) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం గొల్లపాళెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు జీ. సుధాకర్ సూళ్లూరుపేటలోని తన భార్య శ్రావణి, కుమార్తె శ్రుతిని ఆటోలో ఎక్కించుకుని గొల్లపాళెం గ్రామానికి బయలుదేరారు. సూళ్లూరుపేటలోని ఆర్టీసీ డిపో వద్ద వారు వెళతుతున్న ఆటోను వెనుకవైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడడంతో సుధాకర్ రోడ్డుపై పడ్డాడు. అదే క్రమంలో మరో మిని లారీ వేగంగా ఆతని పై ఎక్కడంతో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రావణి, శ్రుతిలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుత్రిని మెరుగైన చికిత్స కోసం చైన్నెకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


