రూ.కోటి నగదు అవార్డు దక్కించుకున్న పంచాయతీ
భారతదేశంలో బొక్కసంపాళేనికి ప్రథమ స్థానం
చిన్న ప్రశంస.. ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది.. మరిన్ని విజయాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక రాష్ట్రస్థాయి పురస్కారమైతే ఆ సంతోషం మరింత ఎక్కువ.. అదే దేశస్థాయి పురస్కారమైతే ఆ ఆనందం మాటల్లో చెప్పనలవికానిది.. అదే నేడు శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెం వాసుల్లో నెలకొంది. కారణం.. ఆ పంచాయతీ దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ ఎంపికై ప్రథమస్థానం నిలిచింది.
●
డెయిరీకి పాలుపోస్తున్న
మహిళా పాడి రైతులు
తిరుపతి అర్బన్: కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్‌శాఖ నేతృత్వంలో ఏటా సుస్థిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన పంచాయతీలకు డీడీయూపీఎస్‌వీపీ (దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్) పురస్కారాన్ని అందిస్తారు. ఈ ఏడాది దేశంలోనే శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెం పంచాయతీని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పంచాయతీకి కేంద్ర సర్కార్ రూ.కోటి నగదు అవార్డును అందిస్తోంది. ఆ నిధులు పంచాయతీ అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. స్నేహక పూర్వక గ్రామ విభాగంలో ఈ ఎంపిక జరుగుతుంది. అందుకు ప్రధానంగా లెక్కించే అంశాలు మహిళా సానుకూల గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, నీటి స్వయం సమృద్ధి గ్రామం తదితర తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తొమ్మిది అంశాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పంచాయతీల్లో దేశ వ్యాప్తంగా ఏటా 27 పంచాయతీలను ఎంపిక చేశారు. అందులో మొదటి స్థానంలో బొక్కసపాళెం పంచాయతీని ఎంపిక చేశారు. ఈ పంచాయతీలో వ్యవసాయం, పాడి పంటలు ప్రధాన జీవనాధారం అయినప్పటికీ మహిళలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా టైలరింగ్, డెయిరీ ఉత్పత్తులు, కలంకారీ, సబ్బుల తయారీ తదితర వృత్తుల్లో బొక్కసంపాళెం పంచాయతీ సత్ఫలితాలు సాధించడంతో డీడీయూపీఎస్‌వీపీ అవార్డుకు ఎంపికై ప్రథమస్థానంలో నిలిచింది. డీపీఓ సుశీలాదేవితోపాటు గ్రామ సర్పంచ్ రేఖ, పంచాయతీ కార్యదర్శి విజయ్, డిప్యూటీ ఎంపీడీఓ పద్మజతోపాటు మహిళలకు పలు విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన వారిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు.
డీడీయూపీఎస్‌వీపీ పురస్కారానికి బొక్కసంపాళెం ఎంపిక
దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం హర్షణీయం
దేశంలోనే శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెం పంచాయతీ ప్రథమ స్థానం దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దేశ వ్యాప్తంగా డీడీయూపీఎస్‌వీపీ పురస్కారానికి 27 పంచాయతీలను ఏటా ఎంపిక చేసినప్పటికీ బొక్కసంపాళెం మొదటి స్థానంలో ఉండడం అభినందనీయం. పురస్కారానికి రూ. కోటి నగదు అవార్డు రానుంది. ఆ నిధులు పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేస్తాం. పంచాయతీ ప్రజలతోపాటు అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తున్నాం.
– సుశీలాదేవి, జిల్లా పంచాయితీ అధికారి


