వెంకటగిరి రూరల్: ఏపీ జోన్–4 పరిధిలో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులకు ఏపీ మోడల్ స్కూల్ ద్వారా ఐఐటీ, జేఈఈ, ఈఏపీ సెట్ కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసిజ్యోతి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏపీ జోన్–4 పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేసిన వంద మంది బాలురకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌లో శిక్షణలో అనుభజ్ఞలైన అధ్యాపకులచే విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడంతోపాటు అభ్యాస పాఠ్యపుస్తకాలు (స్టడీమెటీరియల్) రోజు వారీ పరీక్షలు, వారాంత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సాదర వీడ్కోలు
తిరుపతి, అన్నమయ్యసర్కిల్: రెండు రోజుల పాటు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం సాయంత్రం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి తిరుగు పయనమైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సాదర వీడ్కోలు పలికారు. ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, ఏఎస్పీ రవి మనోహరచారి, ఆర్టీఓ రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
రిజిస్ట్రార్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం!
– ఎస్వీయూ ఈసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిపాలనా భవనంలో మంగళవారం పలు కీలక అంశాలపై వీసీ అధ్యక్షతన ఈసీ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ సాధారణ బడ్జెట్ ప్రధాన అజెండాగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆన్‌లైన్ విధానంలో సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎడ్యుకేషన్) పలు అంశాలపై ఆరా తీశారని, రిజిస్ట్రార్ వద్ద సమగ్ర సమాచారం లేకపోవడంతో ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో బుధవారం వర్సిటీలో జరగాల్సిన అకడమిక్ సెనేట్ సైతం వాయిదా పడింది. అలాగే వర్సిటీలో ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు అధ్యాపకులపై వచ్చిన నివేదికల ప్రకారం తక్షణ చర్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందులో ఓ ప్రొఫెసర్‌కు ఈసీ సమావేశంలో క్లీన్‌చిట్ ఇచ్చినట్టు తెలిసింది. రూ.225 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించింది. అటానమస్ కళాశాలలకు అప్లియేషన్ ఫీజు రూ.59 వేలుగా నిర్ణయించారు.


