పుల్లంపేట: మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలు ప్రభుత్వభూములు అన్యాక్రాంతమయ్యాయని ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వభూములను కూటమి నాయకులు, కార్యకర్తలు దోచుకున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులకు విషయం తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తిచూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి తోడు విద్యుత్‌శాఖ అధికారులు అడిగిందే తడవుగా ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయడంతో కబ్జాదారులు దర్జాగా ఆక్రమణల పర్వానికి తెరలేపారని ఆరోపించారు. మండలంలోని అనంతసముద్రం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 325లో 0.03 సెంట్లు, సర్వేనంబర్ 307 శ్మశానస్థలం 0.07 సెంట్లు చూపించి ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయించుకున్న ఘనత కూటమి నాయకులకే దక్కుతుందన్నారు. ఎక్కడా ప్రభుత్వం ఒక సెంటు భూమిని మంజూరు చేయకపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక మండలంలో దాదాపు 350 దొంగ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారన్నారు. రెవెన్యూ అధికారులు అనంతసముద్రం రెవెన్యూపరిధిలో రూ.6 కోట్ల విలువైన భూములను కూటమి నాయకులకు కట్టబెట్టారన్నారు. దేవసముద్రం చెరువులో నుంచి టిప్పర్లతో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రైతులు వ్యవసాయ అవసరాలకు అడిగితే నిబంధనలు గుర్తుకు వస్తాయా? అని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను నిలదీశారు. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం మీకే చెల్లిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ మండలంలో రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఎంపీడీఓ జయశ్రీ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో ఇంటిపన్నులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించాలన్నారు. వైద్యాధికారి అశ్వినిచంద్ర మాట్లాడుతూ గర్భిణులకు పీఎమ్‌ఎస్‌ఎమ్‌ఏ పథకం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఐరన్ ఫోలిక్ యాసిడ్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ కొత్తగా ఇండ్లు మంజూరు కాలేదని హౌసింగ్ ఏఈ హరిప్రసాద్ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఏఈ కుమార్ చౌదరి కోరారు. పశువైద్యాధికారి సుదీష్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కో–ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్టాక్, వైస్ ఎంపీపీలు జయశంకర్, సుబ్బరత్నమ్మ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


