తొమ్మిది పసిడి పతకాలు సాధించిన వెటర్నరీ విద్యార్థిని స్నాతకోత్సవంలో గవర్నర్ ప్రశంసలు
●
తిరుపతి సిటీ: బీవీఎస్‌సీ విద్యార్థిని రిషిత 9 పసిడి పతకాలను సాధించి రికార్డు నెలకొల్పింది. మార్చి 30వ తేదీన తిరుపతి వెటర్నరీ వర్సిటీ 13వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్‌సీ) కోర్సులో విద్యార్థిని రిషిత 9 బంగారు పతకాలు సాధించి, గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పతకాలు అందుకుని ప్రశంసలు పొందారు.
వెటర్నరీ అధికారిగా సేవ చేయాలన్నదే లక్ష్యం
చాలా సంతోషంగా ఉంది. నిరంతర కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం, అక్క ఆదర్శంతో 9 బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించాను. వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకోవడం గర్వంగా అనిపించింది. మాది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, అమ్మ గృహిణి. అక్క వెటర్నరీ వైద్యురాలు. ఆమె స్ఫూర్తితో ఇన్ని పతకాలు సాధించాను. చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. పదో తరగతి లో పదికి 10 పాయింట్లు, ఇంటర్‌లో 985 మార్కు లు సాధించి ఎంసెట్‌లో ర్యాంక్‌తో బీవీఎస్సీలో చే రాను. విజయవాడ గన్నవరం పశువైద్య కళాశాలలో బీవీఎస్సీలో సీటు సాధించి తొలి ఏడాది నుంచి కష్టపడి చదివాను. అధ్యాపకుల సహకారం మరువలేనిది. వర్సిటీ, కళాశాల, బాలికల విభాగం, ఎన్‌సీసీ, ఎక్స్‌ట్రా కరికులమ్, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఎల్‌పీటీ ప్రాజెక్ట్ ఇలా ఎనిమిది విభాగాల్లో టాపర్ నిలిచి బంగారుపతకాలు సాధించాను. అలాగే యూనివర్సిటీ పరిధిలో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థిగా మరో పతకం సాధించాను. దీంతో పాటు మరో వెండిపతకం సైతం లభించింది. వెటర్నరీ ఆఫీసర్‌గా పాడి పరిశ్రమకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో ఎంవీఎస్సీ చేసేందుకు సన్నద్ధమవుతున్నా. – కారు మంచి రిషిత,
బీవీఎస్సీ విద్యార్థిని, గన్నవరం పశువైద్య కళాశాల


