ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. గల్ఫ్ యుద్ధం కాస్తా.. మనదేశంలో జన జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత చిన్నపాటి టిఫిన్ సెంటర్ యజమానుల నుంచి బడా హోటళ్ల నిర్వాహకుల వరకు అందరినీ వేధిస్తోంది. లక్షలాది మంది జీవనోపాధికి గండికొడుతోంది. ‘బండ’ బాధలు భరించలేక కొందరు దుకాణలను బంద్ చేసుకున్నారు. మరికొందరు బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడి నెట్టుకొస్తున్నారు. ఇంకొందరు పాత పద్ధతిలో కట్టెల పొయ్యలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కలప వ్యాపారులు సైతం డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి హోటల్ నిర్వాహకులను నిలువుదోపిడీ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే గృహ వినియోగదారులు సైతం సకాలంలో గ్యాస్ సిలిండర్ లభించకపోవడంతో నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించుకుంటున్నారు. కొందరు వంట చెరుకుతో ఆహారపదార్థాలు తయారు చేసుకుని క్షుద్బాధ తీర్చుకుంటున్నారు. ఏది ఏమైనా అందరి బతుకులను పశ్చిమాసియా యుద్ధం అయోమయంలోకి నెట్టేస్తోంది. అందులో గ్యాస్ బండ జీవన విధానమే మార్చుకునే పరిస్థితులను తీసుకువస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి
గ్యాస్ కొరత కారణంగా తిరుపతిలో మూసివేసిన హోటళ్లు


