తిరుపతి సిటీ : మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి ఏ టుడే నేషనల్ లెవల్ టెక్నో అండ్ కల్చరల్, స్పోర్ట్స్ ఫెస్ట్‌లో తిరుపతి పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు ప్రథమ స్థానం సాధించారు. శనివారం ఈ మేరకు ప్రతిభ చూపిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ అభినందించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలో తమ కళాశాల విద్యార్థినులు విజేతలుగా నిలవడం గర్వంగా ఉందని వెల్లడించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి భారతి, వైస్ ప్రిన్సిపల్ భద్రమణి, డిప్యూటీ వార్డెన్ భారతి, జ్యోతి, సరిత పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు
పకడ్బందీ ఏర్పాట్లు
తిరుపతి అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11.30గంటలకు దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని చెప్పారు. అనంతరం 11.50 గంటలకు నాయుడుపేట మండలం పుదూరులో టిడ్కో గృహాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 12.40 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 2.40 గంటలకు నాయుడుపేట మండలం బిరదవాడలో రాజకీయ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 4.20 గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 4.35కి ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీ గ్రౌండ్‌కు చేరుకుంటారన్నారు. 4.45 గంటలకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించనున్న పీ4 కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. 6.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు తిరుగుప్రయాణం కానున్నట్లు వివరించారు.
రేపటి నుంచి గవర్నర్ పర్యటన
తిరుపతి అర్బన్ : గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 30వ తేదీ నుంచి రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గవర్నర్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అనంతరం 3 గంటలకు తిరుపతి బైపాస్ రోడ్డు సమీపంలోని తాజ్ హోటల్‌కు వెళతారని వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి స్నాతకోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం 6.25 గంటలకు తిరుమల శ్రీభాగ్య రెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని వివరించారు. 3.20 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించారు.
పక్కాగా వ్యర్థాల నిర్వహణ
తిరుపతి అర్బన్ : హాస్టళ్లలో వ్యర్థాల నిర్వహణను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం తిరుపతి బైరాగిపట్టెడలోని బీసీ హాస్టల్‌లో జరిగిన స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్రలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్లను వేరు చేయడంలో సోర్స్ సెగ్రిగేషన్ పద్ధతిని అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను శాసీ్త్రయ విధానంలో డీ కంపోజ్ చేసి ఎరువుగా మార్చాలన్నారు. ఆ ఎరువును అదే హాస్టల్‌లో ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్ తదితర కూరగాయలను పండించేందుకు వినియోగించాలని స్పష్టం చేశారు. పొడి చెత్తను ప్రతి గురువారం స్వచ్ఛరథం ద్వారా సేకరించి రీసైక్లింగ్‌కు పంపించాలని సూచించారు. బీసీ వెల్పేర్ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి, డీపీఓ సుశీలాదేవి పాల్గొన్నారు.


