తెప్పపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు
ఆలయంలో భక్తుల రద్దీ
నాగలాపురం : శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న సూర్య పూజోత్సవాలు శనివారంతో సంపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా వేకువజామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. ఉదయం 11 గంటలకు దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి గర్భాలయాన్ని స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయం మార్మోగింది. అనంతరం ఉభయదేవేరీ సమేతంగా స్వామివారిని తిరుచ్చి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి సర్వాలంకారభూషితులైన స్వామి, అమ్మవార్లను పుష్కరిణలో తెప్పపై కొలువుదీర్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఏడుపర్యాయాలు ప్రదక్షిణ చేయించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను పరవశింపజేశాయి. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ మునిశంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, ఆలయ అధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.


