తిరుపతి రూరల్ : రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌ను విరివిగా అమర్చడమే లక్ష్యంగా ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ వరకు ‘సూర్యఘర్ ఉత్సవ్’ నిర్వహించనున్నట్టు ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. శనివారం ఈమేరకు రూఫ్ టాప్ సోలార్, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. జాప్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసిస్టెంట్ ఇంజనీర్లు తమ పరిధిలో వ్యవసాయ విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులతో స్వయంగా మాట్లాడి, స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. సీనియారిటీ లిస్టును ఆయా సెక్షన్ల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని సూచించారు.ఒకే అంశంపై పలుమార్లు అభ్యర్థనలు నమోదైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం సర్కిల్‌లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసిన ఫిర్యాదుపై డీఈ ఎం. శ్రీనివాసులు నాయుడుకు షోకాజ్ నోటీసు జారీ చేశామని, అలాగే ఏఈఈ బి. బాలచంద్రపై సస్పెన్షన్ వేటు వేశామని వివరించారు. కాన్ఫరెన్స్‌లో సంస్థ డైరెక్టర్లు కె. గురవయ్య, పి.అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, సీహెచ్ రామచంద్రరావు, జనరల్ మేనేజర్లు జి.చక్రపాణి, వి.విజయన్, ఎస్‌ఈలు రమణ, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, రాఘవేంద్ర, మోసెస్, సోమశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, ప్రదీప్ కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.


