తిరుపతి సిటీ:యువతకు విద్యతోపాటు నూతన పరిశోధనల దిశగా దృష్టి సారించడం అవసరమని టీటీడీ డీఈఓ వెంకట సునీల్ తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన దక్షిణ భారత న్యూమిస్మాటిక్ సొసైటీ వార్షిక సదస్సు బుధవారంతో ముగిసింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ న్యూమిస్మాటిక్స్ అనేది కేవలం నాణేల సేకరణ మాత్రమే కాదని, మన చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకునే ప్రధాన అధ్యయన రంగమని వెల్లడించారు. గొప్ప వారసత్వ సంపద కలిగిన మనదేశంలో నాణేల అధ్యయనం ద్వారా అనేక చారిత్రక అంశాలను వెలికితీయవచ్చని వివరించారు. ఇలాంటి సదస్సులు యువతలో చరిత్రపై ఆసక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు పరిశోధన దిశగా ముందుకు వచ్చి, మన దేశపు వారసత్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. అనంతరం విశ్రాంత ప్రొఫెసర్ శకుంతలను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, అధ్యాపకులు భీమన్న, మల్లికార్జునరావు, కిషన్, ప్రసాద్ రావు, సుబ్రమణ్యం, ఉష, విజయశ్రీ, ఉమారాణి, తేజోవాణి, శ్రీదేవి పాల్గొన్నారు.
రూ.10 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బుధవారం రూ.10 లక్షల విరాళం అందింది. విజయవాడలోని ఆయూష్ ఆస్పత్రి డాక్టర్ ఉప్పాలచక్రపాణి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు డీడీని అందజేశారు. డాక్టర్ కోడెల శివరామకృష్ణ పాల్గొన్నారు.


