ఆదేశాలు బేఖాతర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదేశాలు బేఖాతర్‌

Mar 26 2026 7:18 AM | Updated on Mar 26 2026 7:18 AM

● స్వర్ణముఖి పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ● హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోని అధికారులు ● అక్రమార్కులకు అండగా టీడీపీ నేతలు

మా రాజ్యం.. మా ఇష్టం అన్నట్టు అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో అక్రమార్కులకు వంత పాడుతున్నారు. స్వర్ణముఖి నదీపరీవాహక ప్రాంతాల్లో ఆక్రమణలకు సహకారం అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. రెవెన్యూ అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు. అక్రమ కట్టడాలను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను బుట్టదాఖలు చేసేశారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : తిరుపతి రూరల్‌ మండలం చిగురువాడ పంచాయతీ దక్షిణపు కండ్రిగ లెక్క దాఖలా సర్వే నంబరు 160లోని స్వర్ణముఖి నది పోరంబోకు భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు కనీసం మాత్రం స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్వర్వులను అమలు చేసేందుకు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చినప్పటికీ అధికారుల్లో చలనం కనిపించడం లేదని మండిపడుతున్నారు.

ధిక్కరణ ముప్పు?

హైకోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారుల పై ఎటువంటి చర్యలు ఉంటాయో అని రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తొలగింపు చర్యలకు ఉన్నతాధికారులు ఆసక్తి చూపలేదని చర్చించుకుంటున్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్‌, ఆర్‌డీఓ, తిరుపతి రూరల్‌ తహసీల్దార్‌ తదితరులు ఉన్నారు. వీరికి కోర్టు దిక్కరణ ముప్పు తప్పదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేడెక్కిన వ్యవహారం

అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే ఆక్రమణల జోలికి అధికారులు వెళ్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నది పరీవాహక భూములను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో హైకోర్టు ఉత్తర్వుల ను సైతం అధికారులు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గడువు దాటినా..

నది పోరంబోకు భూముల్లో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేసేశారు. అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. దీంతో స్థానికుడు ముచ్చేలి కిరణ్‌కుమార్‌రెడ్డి పలు మార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. వారు పట్టించుకోక పోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు. కేసు నంబరు 29317 కింద విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ల్యాండ్‌ ఎంక్రోచ్‌ మెంట్‌ యాక్ట్‌ 1905 ప్రకారం స్వర్ణముఖి నది భూమిపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని స్పష్టం చేసింది. సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులను అమలు చేయడానికి రెండు నెలల సమయమిచ్చింది. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన గడువు పూర్తవడంతో రెవెన్యూ అధికారులపై కోర్టు దిక్కరణ పిటిషన్‌ వేయనున్నట్లు ఫిర్యాదీ కిరణ్‌ కుమార్‌రెడ్డి వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement