తిరుపతి అర్బన్ : గరుడ వారధిపై ద్విచక్రవాహనదారులు ప్రయాణించాలంటే హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో రహదారుల భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.వారు మాట్లాడుతూ గరుడ వారధిపై భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. రోడ్లపై ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించాలని ఆదేశించారు. రహదారుల సమీపంలో రెస్ట్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, మద్యం దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులకు అత్యవసర చికిత్స నిమిత్తం ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా మత్తు పదార్థాల వినియోగంతో తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పించాలని కోరారు. మెడికల్ స్టోర్స్‌లో మత్తు పదార్థాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం గంజాయి నివారణ, డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరచారి, నేషనల్ హైవే పీడీలు వెంకటేశ్వర్లు, రవీంద్రరావు, చౌదరి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజానాయక్, ఆర్‌టీఓ మురళీమోహన్, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు.


