ఆలయంలోకి ప్రవేశిస్తున్న సూర్య కిరణాలు
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో సూర్యపూజోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం ఈ మేరకు స్వామివారికి సూర్యభగవానుడు ప్రణమిల్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో గర్భాలయ రెండో మెట్టును తన కిరణాలతో స్పృశించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి భక్తులు పునీతులయ్యారు. ఈ సందర్భంగా సూర్య కిరణాలు పయనించిన మార్గాన్ని అర్చకులు పుణ్యజలాలతో అభిషేకించారు. భక్తులు గోవిందనామ స్మరణతో పులకించారు. అనంతరం దేవదేవేరులను విశేషంగా అలంకరించి, తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చారు. మాడ వీధుల్లో కనులపండువగా ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ మునిశంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, అధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. – నాగలాపురం


