తిరుపతి అర్బన్: జిల్లాలో ఎస్టీ, ఎస్సీల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, డీఆర్‌ఓ నరసింహులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ ఎస్సీ, ఎస్టీల సమస్యలను స్వయంగా అధికారులు తనిఖీ చేసి తక్షణమే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని స్పష్టం చేశారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి స్థల కేటాయింపులను సత్వరమే చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, ఆర్డీఓలు రామ్మోహన్, భాను ప్రకాష్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, బీసీ వెల్పేర్ అధికారి భరత్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ, సాధికార అధికారి హరీష్, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజానాయక్, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్, అగ్రికల్చర్ జేడీ ప్రసాద్‌రావు, కార్మిక శాఖ అధికారి చిన్న లాలప్ప పాల్గొన్నారు.


