దోపిడీ దందా చేయడంలో అధికార పార్టీ నేతలకు తానేమీ తీసిపోనని ఓ అటవీ అధికారి పేట్రేగిపోతున్నారు. అవసరాల నిమిత్తం అడవి నుంచి ఎండు కట్టెలు తెచ్చుకున్నా జరిమానా విధించే అటవీ అధికారులే వన భక్షులైతే..!? చంద్రగిరిలో ఓ అటవీ అధికారి ఏకంగా ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా మట్టిని తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చంద్రగిరి: మండలంలో పనపాకం రేంజ్ పరిధిలోని తూర్పుపల్లె అటవీ ప్రాంతంలో గతంలో ప్రభుత్వం ప్లాంటేషన్‌లో భాగంగా పెద్ద ఎత్తున అల్లనేరేడు చెట్లను పెంచింది. అటవీ సిబ్బంది కృషి ఫలితంగా అల్లనేరేడు చెట్లు ఏపుగా పెరిగి కాయలు కాసే స్థితికి వచ్చాయి. అయితే పనపాకం రేంజ్ కార్యాలయంలోని ఓ అధికారి ధన దాహానికి ప్లాంటేషన్‌లో ఎర్రమట్టి తరిగిపోతోంది. మూడు రోజుల పాటు రాత్రుల్లో తూర్పుపల్లెకు చెందిన స్థానికుడు, కింద స్థాయి అధికారితో చేతులు కలిపి జేసీబీల సాయంతో మట్టి లోడి ట్రాక్టర్లలో తరలించేశాడు.
పక్క మండలంలో అనధికార విక్రయాలు
ప్లాంటేషన్ నుంచి తవ్వేసిన ఎర్రమట్టిని పాకాల మండలంలో విక్రయించారనేది స్థానికుల ఆరోపణ. పాకాల మండలంలో ఇళ్ల నిర్మాణాలతో పాటు గాదంకి సమీపంలోని ఓ నర్సరీకు సైతం ఈ మట్టిని తరలించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు సాగిన ఈ దందాలో సుమారు 70 లోడ్లకు పైగా మట్టిని విక్రయించారని, ఒక్కో ట్రాక్టరు మట్టిని సుమారు రూ.4వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం..!
ప్లాంటేషన్ నుంచి మట్టిని తరలించడం ముమ్మాటికి నేరమే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్లాంటేషన్ నుంచి మట్టిని తరలించినట్లు ఫిర్యాదు వచ్చింది. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తాం. ప్లాంటేషన్‌కు నష్టం వాటిల్లినట్లు నిర్ధారణైతే చర్యలు తీసుకుంటాం.
– సాయిబాబా, ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ
నర్సరీకు తరలించి.. నకిలీ బిల్లులు సృష్టించి..!
పనపాకంలోని నర్సరీతో పాటు గాదంకిలోని నర్సరీకి మట్టిని తరలించడంతో పాటు అక్కడి అధికారులతో ఆయన కుమ్మకై ్క దొంగ బిల్లులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల కళ్లుగప్పి మట్టి కోసం సుమారు రూ.2లక్షలకు పైగా బిల్లులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఆ అధికారిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారి అవినీతి బాగోతం బయటపడటంతో చర్చనీయాంశమైంది. అటు అటవీ శాఖలోనూ కథలు..కథలుగా చెప్పుకుంటున్నారు.


