తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ బీసీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను చులకనగా చూస్తున్నారని, దాడులకు తెగబడుతున్నారని.. తిరుపతి ప్రకాశం రోడ్డులో సచివాలయ అడ్మిన్ సెక్రటరీ నాగార్జున యాదవ్‌పై దాడి ఘటనను ఆయన ఉదహరించారు. పన్ను చెల్లించమని కోరిన ఆయనపై ఒక ప్రింటర్స్ అధినేత తన స్నేహితులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేయడం శోచనీయమని ఖండించారు. రుయా ఆసుపత్రిలో నాగార్జున యాదవ్‌ను పరామర్శించి ఆయన మాట్లాడారు. కూటమి నాయకులు ఇలా పేట్రేగిపోతూ దాడులు చేయడం వెనుక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండదండలు ఉండటమేనని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యాదవ్‌పై దాడి కేసును నీరుగార్చేందుకు స్థానిక కార్పొరేటర్‌తో పాటు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సచివాలయ ఉద్యోగులతో పాటు వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నాగార్జున యాదవ్‌ను పరామర్శించిన వారిలో పార్టీ బీసీ నాయకులు కట్టా గోపీయాదవ్, శరత్‌యాదవ్, మురళీయాదవ్, కృష్ణ యాదవ్, శేషుయాదవ్, శశియాదవ్ ఉన్నారు.


