తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు మంగళవారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు రథోత్సవం కళాబృందాల భక్తి సంకీర్తనాలాపన, భజనలు, భక్తజన సందడి నడుమ కోలాహలంగా సాగింది. శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు రథాన్ని అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రథాన్ని లాగుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అలాగే అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరుమంజనం. ఆస్థానం, సాయంత్రం 6నుంచి 7 గంటల వరకు ఉయ్యాలసేవ, ఆ తర్వాత రాత్రి అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఇంజినీరింగ్ అఽధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు చక్రస్నానం
శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు.


