– 28 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చంద్రగిరి: స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మార్చి 28 నుంచి ఏప్రిల్ 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కార్యక్రమంలో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి మొదలైన వాటిని నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ దినేష్‌కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్చి 27న అంకురార్పణ
బ్రహ్మోత్సవాలకు 27న సాయంత్రం అంకురార్పణతో శ్రీకారం చుడతారు. సేనాధిపతి ఉత్సవం, విష్వక్సేనారాధాన, పుణ్యాహవచనం, వాస్తు పూజ, అంకురార్పణ నిర్వహిస్తారు. 28న ఉదయం 8 నుంచి 8.45 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారు.


