తిరుపతి అర్బన్: గాలేరు–నగరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా భరత్ నాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిసి పూల మొక్కను అందజేశారు.
4 నుంచి ‘మై సైన్స్ గ్యారేజ్’
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్‌లో ఏప్రిల్ 4 నుంచి ఏడాది పొడవునా మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 3, 4, 5వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పిల్లలే స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్‌లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా ఈ గ్యారేజ్‌ను నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్ నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సైన్స్ సెంటర్ అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులకు రూ.2వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు హెచ్‌టీటీపీఎస్://టీఐఎన్‌వైయూఆర్‌ఎల్.కామ్/ఆర్‌ఎస్‌సీటీమైసైన్స్‌గ్యారేజ్’ లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరాఉఉ. పూర్తి వివరాలకు 79896 94681, 0877–2286202 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నాణేలు..
చరిత్రకు ప్రతిబింబాలు
తిరుపతి సిటీ : నాణేలు కేవలం లావాదేవీలకే కాదని, దేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. నాణేల అధ్యయన సంస్థ వారు మంగళవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన నాణేల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం అదనపు ఈఓ మాట్లాడుతూ నాణేల అధ్యయనంపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపల్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్ర, పురావస్తు విద్యలపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించేకు అధ్యయన సంస్థ కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు పండితులు, అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. డాక్టర్ రాజారెడ్డి, శకుంతల, కిషన్, టీటీడీ డీఈఓ వెంకట సునీల్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, జయరామయ్య, మధుసూదన్ రావు, అధ్యాపకులు భీమన్న, మల్లికార్జునరావు, ప్రసాద్‌రావు, సుబ్రమణ్యం పాల్గొన్నారు.


