అడ్డొస్తే లారీలతో తొక్కిస్తాం | - | Sakshi
Sakshi News home page

అడ్డొస్తే లారీలతో తొక్కిస్తాం

Mar 7 2026 7:16 AM | Updated on Mar 7 2026 7:16 AM

వరదయ్యపాళెం: గ్రావెల్‌ అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై లారీలతో తొక్కిస్తామని, తమకు అధికార ప్రభుత్వం అండ ఉందని, తమతో పెట్టుకుంటే అంతే సంగతులంటూ గ్రావెల్‌ మాఫియా ఏకంగా గ్రామస్తులపై బెదిరింపులకు దిగుతోంది. ఈ ఘటన శుక్రవారం వరదయ్యపాళెం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బత్తలవల్లం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు తరలిపోతున్న గ్రావెల్‌ లారీలను విఠయ్యపాళెం గ్రామస్తులు అడ్డుకోగా, వారిపై గ్రావెల్‌ మాఫియా ఎదురుదాడికి తెగబడింది. కొన్ని రోజులుగా బత్తలవల్లం సమీపం నుంచి తమిళనాడుకు గ్రావెల్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దీని కారణంగా రోడ్లు ధ్వంసం కావడంతోపాటు స్థానికుల ఇబ్బందుల గురించి గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాక రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని, కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎన్నడూ లేదని గ్రామస్తులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్‌ అక్రమ రవాణా ఆపకుంటే తాము నిలువరించేందుకు దేనికై నా సిద్ధమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గ్రావెల్‌ మాఫియా బెదిరింపులకు తాము జంకబోమని వారు తేల్చి చెబుతున్నారు. అక్రమ అనుమతులతో అధికార పార్టీ బడాబాబులు తమిళనాడుకు గ్రావెల్‌ అక్రమ రవాణా చేపడుతూ రూ.కోట్లు గడిస్తూ స్థానిక ప్రజలను బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement