సైబర్‌ నేరాలే భవిష్యత్‌లో ప్రధాన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలే భవిష్యత్‌లో ప్రధాన ప్రమాదం

Mar 6 2026 8:04 AM | Updated on Mar 6 2026 8:04 AM

తిరుపతి అర్బన్‌: భవిష్యత్‌లో సైబర్‌ నేరాలను ప్రధాన ప్రమాదంగా విద్యార్థులు భావించాలని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని మహిళా అధ్యయన కేంద్రం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి. ఉమాదేవి అన్నారు. గురువారం తిరుపతిలోని కోదండరామ హైస్కూల్‌ విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలం ఆధారంగా ప్రపంచం నిరంతరం కొత్త టెక్నాలజీలతో అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే అత్యాధునిక టెక్నాలజీతో ఓ వైపు లాభాలు, మరోవైపు తీవ్రమైన నష్టాలు పొంచి ఉన్నాయని హెచ్చరించారు. సైబర్‌ నేరాలు అంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఇతర డిజిటల్‌ పరికరాలను ఉపయోగించి చేసే నేరాలుగా పరిగణించాలన్నారు. ఈ పరికరాల వినియోగంలో తప్పులు చోటుచేసుకుంటే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నష్టాలను కలిగించవచ్చని చెప్పారు. బ్యాంకింగ్‌ మోసాలు, అకౌంట్‌లో నగదు చోరీ, హ్యాకింగ్‌, సైబర్‌ స్టాకింగ్‌, డేటా ఉల్లంఘనలు, సోషల్‌ మీడియా మోసాలు తదితర వాటిని ప్రధానంగా సైబర్‌ నేరాలుగా పేర్కొనవచ్చన్నారు. అలాగే వ్యక్తి ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం, ఆర్థిక నష్టాలు, సున్నితమైన డేటా ఉల్లంఘనలు, వ్యవస్థల వైఫల్యం తదితర వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్‌ నేరస్తులు అంటే చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ కంటెంట్‌తో చేసే వ్యాపారం, వీరు వ్యక్తులు లేదా బృందాలు కావచ్చని తెలిపారు. అలాగే గుర్తుతెలియని లింకులు ఈ–మెయిల్‌లను ఓపెన్‌ చేయకూడదని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, బ్యాంకింగ్‌ లావాదేవీలను అప్పుడప్పుడు గమనించాలని సూచించారు. సైబర్‌ నేరాల ఉచ్చులో పడకుండా విద్యార్థినులు తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదండరామ స్కూల్‌ హెచ్‌ఎం సురేంద్రబాబు, టీచర్‌ శైలజ, మహిళా అధ్యయన కేంద్ర ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ప్రీతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement