పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
తిరుపతి రూరల్ : పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ప్రత్యేకంగా నిర్వహించిన పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఆయన బుధవారం తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 26 మంది పారిశ్రామిక వినియోగదారులు తమ సమ్యల్ని తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. ఒకటి, రెండు చోట్ల ఓల్టేజీలో హెచ్చుతగ్గులు వస్తున్నట్టు వినియోగదారులు తెలిపారని పేర్కొన్నారు. మరికొందరు సోలార్ విద్యుత్ బిల్లింగ్, ట్రూ–ఆప్, ఎఫ్ పీపీసీఏల సమస్యలను చెప్పారని తెలిపారు. వాటిని సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి నెలా మొదటి బుధవారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ఆయా జిల్లాల్లోని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో, మూడో బుధవారం తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనూ పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్.పద్మ, కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, ఎం.కృష్ణారెడ్డి, సిహెచ్ రామచంద్రరావు, కె.సంపత్ కుమార్, ఎం.మురళీ కుమార్, జనరల్ మేనేజర్లు జగదీష్, శ్రీనివాసులు, లత తదితరులు పాల్గొన్నారు.


