తుమ్మలగుంటకు
వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటే అందరి చూపు తిరుమల గిరుల వైపు వెళుతుంది. అయితే కొండంత జనం నడుమ శ్రీవారిని దర్శించుకోలేని వారు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని ఆలయానికి తరలివస్తుంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఉత్తర ద్వారం తరహాలోనే తుమ్మలగుంట ఆలయంలో సైతం వైకుంఠ ద్వారాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఈ ఏడాది కూడా తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తిరుపతి రూరల్ : తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం ఈ మేరకు ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యవేక్షించారు. పలు సూచనలు అందించారు.
పనులపై సమీక్ష
వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామి దర్శనార్థం వచ్చి వైకుంఠ ద్వార ప్రవేశం చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పనుల పురోభివృద్ధిపై సమీక్షించారు. ఆలయం వద్ద గ్రామ పెద్దలతో సమావేశమై వివరాలను తెలుసుకున్నారు. పనులను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అద్భుతం.. వైకుంఠ ద్వారం..
ఆలయంలో భక్తులు ప్రవేశించే వైకుంఠ ద్వారాన్ని అత్యద్భుతంగా తయారు చేస్తున్నారు. శ్రీవారి దశావతారాల ప్రతిమలతో పాటు అష్ట లక్ష్మీ దేవిల ప్రతిమలను వైకుంఠ ద్వారంలో ఏర్పాటు చేయిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి తీసుకువచ్చిన పుష్పాలతో అలంకరిస్తున్నారు. దర్శనానంతరం వైకుంఠ ద్వారంలోకి వెళ్లిన భక్తులకు గోవింద నామాలు వినపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భాలయంతో పాటు పరివార దేవతా మూర్తుల ఆలయాలను సైతం విశేషంగా అలంకరిస్తున్నారు.
తుమ్మలగుంటకు
తుమ్మలగుంటకు
తుమ్మలగుంటకు


