టీటీడీ భూములు ప్రైవేట్‌కు ధారాదత్తం దుర్మార్గం
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన సీపీఐ నాయకులతో కలసి అలిపిరి–చెర్లోపల్లి మార్గం అరవింద్ కంటి ఆస్పత్రి సమీపంలోని టీటీడీ భూములు ఒబెరాయ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ హోటళ్లకు టీటీడీ భూములు కేటాయిస్తే మద్యం, మాంసం, క్లబ్బులు, క్యాడ్బరీ డాన్సులు వేయరా? అని ప్రశ్నించారు. గతంలో టీటీడీకి సంబంధించిన భూములను కేవలం విద్యాలయాలకు కేటాయించేవారన్నారు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కేటాయించే అధికారం ఎవరికీ లేదన్నారు. గత ప్రభుత్వం కేటాయిస్తే తప్పు అన్నారు.. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి టీటీడీ దేవుని మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హోటళ్లకు కేటాయించిన భూముల్లో రాత్రి పూట మాత్రమే పనులు చేస్తున్నారని, పగులు ఎందుకు పనులు చేయడం లేదన్నారు. ఈ స్థలంలో సంవత్సరాల చరిత్ర కలిగిన ఎరచ్రందనం చెట్లు ఉన్నాయని, వాటిని ఓబెరాయ్ కంపెనీకి కట్టబెడుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇక్కడే చదువుకున్నారు.. శ్రీవారి భక్తుడు అంటారు.. అతనికి తెలియదా టీటీడీ భూములు ఇవ్వకూడదని? ప్రశ్నించారు. ఇలాంటి భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు కదా మానవసేవయే మాధవసేవ అనే సూక్తిని దేవుడు కూడా హర్షిస్తారన్నారు. టీటీడీ భూముల ప్రైవేట్ పరంపై కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కచ్చితంగ పోరాడుతామని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పరిశీలనలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ, విశ్వనాధ్, ఉదయ్‌కుమార్, బండి చలపతి పాల్గొన్నారు.


