వేదాంతపురంలో బండిబాట కబ్జా
వేదాంతపురం గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 220/4లోని 0.76 సెంట్లు బండి బాటను కొందరు కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించి, మరీ అక్రమ కట్టడాలు కడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆ భూమిలో చిన్నపాటి షెడ్లు వేసుకుని నిరుపేదలు నివాసముండగా ఆ షెడ్లను ధ్వంసం చేసి, దర్జాగా కమర్షియల్ గోడౌన్ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆరోపిస్తున్నారు. అంతేకాక 224లో 0.97 ఎకరాల కాలువ భూమిని సైతం పాత కాలం నాటి అడంగల్ రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకుని రూ.కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు పక్కాగా స్కెచ్ వేశా రని స్థానికులు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. విలువైన ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఆ బాధ్యతలను విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


