మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా? | - | Sakshi
Sakshi News home page

మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా?

Dec 7 2025 7:18 AM | Updated on Dec 7 2025 7:18 AM

మీరు

మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా?

● ముందు మా సమస్యలు వినండి ● వాటి పరిష్కారానికి హామీ ఇవ్వండి సార్‌ ● కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ● తిరుపతికి ఏడీని నియమించలేరా...?

తిరుపతి అర్బన్‌: ప్రజా ప్రతినిధులు ముందుగా మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా సార్‌.. మా సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుంది.. మా సమస్యలపై మేము మాట్లాడిన తర్వాత.. వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ మాట్లాడాలని దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ముందుగా దివ్యాంగుల సంఘం నేతలకు మాట్లాడే అవకాశం కల్పించారు. కలెక్టరేట్‌లో శనివా రం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొణతం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)ని నియమించాలని నిలదీశారు. చిత్తూరు జిల్లా ఏడీ విక్రమ్‌కుమార్‌రెడ్డికే తిరుపతి జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం ఏమిటని నిలదీశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈ నెల 3వ తేదీ జరగాల్సి ఉండగ, ఆ రోజు ఏడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి చిత్తూరులో నిర్వహించాల్సి రావడంతో అదే రోజు ఇక్కడ జరిపే వీలులేక 6వ తేదీ నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇంద్రధనస్సు పేరుతో పురుషులకు సైతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఎస్సీ, ఎస్టీ తరహాలో దివ్యాంగులకు రాయితీలు, బాపట్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే వికలత్వం 70 శాతం పైబడిన వారికి మాత్రమే అంటూ మెలిక పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని 6,500 మందికి వికలత్వం శాతాన్ని తగ్గించి పింఛన్లు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ మీ సమస్యలను నోట్‌ చేసుకున్నామని తప్పకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తుడా చైర్మన్‌ దివాకర్‌రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల ఏడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. తరువాత వివిధ సేవలందించిన దివ్యాంగులకు ప్రశాంసాపత్రాలు పంపిణీ చేసి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంఘం నేతలు మురళి, సుబ్రమణ్యం, మీనాక్షి, మురళీగౌడ్‌,శివకుమారి, మధులత, పెంచలయ్య, మాధవన్‌ తదితరులు పాల్గొన్నారు.

మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా? 1
1/1

మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement