కూటమి నేతలకు ఉలుకెందుకు?
తిరుపతి కల్చరల్: తిరుమల పరకామణి కేసులో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన వాస్తవాలను మాట్లాడితే ఆ మాటలను హేళన చేస్తూ కూటమి నేతలు మూకుమ్మడిగా ఉలికిపాటుతో విమర్శలు చేయడమేమిటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్‌కుమార్ ప్రశ్నించారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు కట్టుకథలు అల్లుతూ ప్రజలను మభ్యపెట్టే నైజం కూటమి నేతలదేనన్నారు. తిరుమలలో ద్రోహం జరిగిపోయిందంటూ కల్తీ నెయ్యి, పరకామణి సంఘటనలను ఎత్తి చూపుతూ ఆ నిందను వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 30 ఏళ్లుగా పరకామణిలో దోపిడీ జరుగుతోందని, రూ.కోట్లు దోచుకున్నారని, టీడీపీ నేతలు పని గట్టుకుని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. పరకామణిలో చోరీ ఘటనను గుర్తించి పట్టుకున్నదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనేనని, అంతకముందు మీరు ఎందుకు పట్టుకోలేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో పరకామణిలో చోరీ ఘటనలో రవికుమార్ 9 డాలర్లు దొంగలించినట్లు పట్టుబడినప్పుడు తెలిసిందని, దీని విలువ రూ.72 వేలని అయినా విచారణ చేసి గతంలో జరిగిన వాస్తవాలను వెలికి తీసి, అతని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తులను న్యాయనిపుణుల సలహాతో దేవుడికి స్వాధీనం చేసింది కూడా అప్పటి టీటీడీ అధికారులని తెలిపారు. టీటీడీలో పటిష్ట భద్రత, ఆధునిక పరికరాల వినియోగం ఉన్నా నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి తాను చూసినట్లు పదే పదే ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సైతం ఎలాంటి విచారణ జరగకనే తిరుమలలో శ్రీవారి ప్రసాదాలకు ఇచ్చే నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వొ కల్తీ జరిగిందని ప్రకటించారని, చంద్రబాబుకు ఈ విషయం ఎవరు చెప్పారో ఆయన సమాధానం చెప్పాలన్నారు. నెయ్యి కల్తీ విషయంపై మొదట ఆరోపణలు చేసిన చంద్రబాబును సిట్ అధికారులు ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకున్న కంపెనీతోనే మళ్లీ వైఎస్సార్ సీపీ నెయ్యి కొనుగోలు చేసిందన్న విషయాన్ని కూడా విస్మరించి తప్పుడు ఆరోపణలతో వైఎస్సార్‌సీపీ పరువు దెబ్బతీయాలని కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. ఒక టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి భక్తి పరాయనుడంటూ గొప్పలు చెప్పుకుంటూ తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించడం విడ్డూరమన్నారు. రెండు సార్లు బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన శ్రీవారి దర్శన టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నీకు దేవుడిపై భక్తి ఉంటే తాను అలాంటి పనులు చేయలేదు, నేడు స్వామి భక్తులకే టికెట్లు ఇచ్చానని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నీవు బోర్డు సభ్యుడిగా ఎవరెవరికి ఎంత మందికి దర్శన టికెట్లు ఇచ్చావో చెప్పి నీ సచ్ఛీలత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు నల్లాని బాబు, మహేష్, మద్దాల శేఖర్ పాల్గొన్నారు.


