తిరుపతి అర్బన్ : రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాకు వస్తుంటే....ఆయన ప్రోగ్రామ్‌లో స్పష్టత కరువైంది. రెండు రోజుల క్రితం ఈ నెల 7 (శుక్రవారం), 8 (శనివారం) రెండు రోజుల పాటు అటవీశాఖకు సంబంధించి పర్యవేక్షణ నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తారని జీఆర్ మధుసూదన్ పేరుతో ఓ ప్రకటన వెల్లడించారు. ఆ తర్వాత మరుసటి రోజు 9న (ఆదివారం) చిత్తూరు జిల్లాలోని పలమనేరులో అటవీశాఖ పరిధిలో ఒక్క రోజు పర్యవేక్షణ ఉన్నట్లు మరో ప్రకటన వెల్లడించారు. తాజాగా తిరుపతి జిల్లా సమాచారశాఖ విభాగానికి చెందిన అధికారులు శుక్రవారం సాయంత్రం 6.08 గంటల సమయంలో ఓ ప్రకటన మీడియాకు విడుదల చేశారు.
డిప్యూటీ సీఎం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లో సమావేశం ఉంది...ఐదు నిమిషాలు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంది...ఆ తర్వాత మీడియాకు అనుమతి లేదు... అనంతరం ప్రెస్ బ్రీఫింగ్ ఉందని వెల్లడించారు. అయితే శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తిరుపతి కలెక్టరేట్‌కు ఏ మార్గంలో వస్తారో సమాచారం ఇవ్వలేదు. కేవలం రెండు లైన్లు ప్రకటనలో అసంపూర్తి సమాచారంతో సమాచారశాఖ ప్రకటన విడుదల చేయడం ఏంటో అంటూ అంతా చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం జిల్లాకు వస్తుంటే అంతా గోప్యంగా సమాచారాన్ని ఉంచాల్సిన అవసరం ఏముందో అంటూ చర్చించుకుంటున్నారు. మంత్రులు వస్తేనే పూర్తి వివరాలు వెల్లడించే సమాచారశాఖ అధికారులు డిప్యూటీ సీఎం వస్తుంటే రెండు లైన్లతో కనీసం ఏ మార్గం ద్వారా తిరుపతి కలెక్టరేట్‌కు వస్తున్నారో అనే సమాచారాన్ని ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల : తిరుమల శ్రీవారిని గురువారం సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి, ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని, సినీనటి దీవి వదిత్య దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.


