అసభ్య ప్రవర్తనపై ఆగ్రహం
తిరుపతి సిటీ: ప్రొఫెసర్, సీనియర్లు విద్యార్థులు జూనియర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉన్నతాధికారులు చేసిన రాజీ ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఎట్టకేలకు సీనియర్ల సస్పెన్షన్, ప్రొఫెసర్‌పై విచారణ కమిటీ ఏర్పాటుకు హామీతో శాంతించాయి. ఎస్వీయూలో అధ్యాపకుల తీరు మారలేదు. కూటమి ప్రభుత్వ ఏర్పడిన నాటి నుంచి విద్యార్థినులపై లైగింక వేధింపులు శ్రుతి మించాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్వీయూ జరిగిన ఘటన విద్యార్థి లోకాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సైతం వర్సిటీలో ఏమి జరుగుతోందో అర్థం కాక హుటహుటిన వర్సిటీకి చేరుకున్నారు. ఏడాదిగా వర్సిటీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
తక్షణం చర్యలు తీసుకోవాలి
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారని, సీనియర్ విద్యార్థులతో ర్యాగింగ్ చేయిస్తున్నారని నలుగురు విద్యార్థినులు సోమవారం రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించేందుకు లేడీస్ హాస్టల్ వార్డెన్లను పిలిపించి రాజీ చేయాలన్న ప్రయత్నం జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన ప్రారంభించాయి.
రాజీకి పావులు కదిపిన అధికారులు
ఈ నేపథ్యంలో రెక్టర్ అప్పారావు బాధిత విద్యార్థినులను తన చాంబర్‌లోకి పిలిపించి ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డితో రాజీ చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు రెక్టార్ చాంబర్ తలుపులు పగులగొట్టి లోపలికి దూసుకెళ్లారు. తరువాత రిజిస్ట్రార్, రెక్టార్ విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకున్నారు. వీసీ ఢిల్లీలో ఉన్నందున రిజిస్ట్రార్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి, ప్రొఫెసర్‌పై విచారణ కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తాం
ఢిల్లీ నుంచి బుధవారం వీసీ వచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనను విరమించాయి. ఈ ఆందోళన సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థి నాయకులు గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ, జీఎన్‌ఎస్, జేబీఎస్‌ఎఫ్ నాయకులు రవి, అక్బర్, అశోక్, వినోద్, చలపతి, జెన్నె మల్లికార్జున, సుందర్ రాజు,ప్రేమ్ కుమార్, శివశంకర్ నాయక్, షేక్స, తిరుమలేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అసభ్య ప్రవర్తనపై ఆగ్రహం
అసభ్య ప్రవర్తనపై ఆగ్రహం


