7వ తేదీ పైనే స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

7వ తేదీ పైనే స్పాట్‌ అడ్మిషన్లు

Nov 4 2025 7:50 AM | Updated on Nov 4 2025 7:50 AM

7వ తేదీ పైనే స్పాట్‌ అడ్మిషన్లు

7వ తేదీ పైనే స్పాట్‌ అడ్మిషన్లు

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 7వ తేదీపైన నిర్వహించనున్నారు. ఆ రోజు వరకు థర్డ్‌ పేజ్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో ఉన్నత విద్యామండలి ఈనెల 7వ తేదీపై టీటీడీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌, జూలై నెలల్లో డిగ్రీ అడ్మిషన్లు పూర్తి కావాల్సిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో నవంబర్‌ నెలలో సైతం డిగ్రీ అడ్మిషన్లు కొనసాగడంపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా డిగ్రీ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనడానికి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ నిదర్శనమని అటు తల్లిదండ్రులు, ఇటు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ

తిరుమల: తిరుమలలో నవంబర్‌ 5న కార్తీక పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ఆ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి వారు సువర్ణ కాంతులీనుతున్న గరుడునిపై ఆశీనుడై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

జిల్లా యువజనోత్సవ పోటీలు నేడు

తిరుపతి కల్చరల్‌: ప్రభుత్వ యువజన సర్వీ సుల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ రోడ్డులోని ఎమరాల్డ్స్‌ డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో మంగళవారం ఉదయం 9 నుంచి జిల్లాస్థాయి యువజనోత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు సెట్విన్‌ సీఈఓ యశ్వంత్‌ తెలిపారు. శ్రీవివేకానందస్వామి జయంతి సందర్భంగా ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు చేపడుతూ యువకళాకారుల ప్రతిభను మరింత ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జిల్లాస్థాయి యువజనోత్సవంలో జానపద బృంద నృత్యాలు, జానపద గీతాలాపన, కవిత్వం, కథ రాయడం, పెయింటింగ్‌, వివిధ సాంస్కృతిక పోటీలు ఉంటాయని తెలిపారు. 15– 29 ఏళ్ల వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను చాటాలని కోరారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు తమ పేరు, పుట్టిన తేదీతో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, పోటీలో పాల్గొనే అంశాలతో పోటీలు నిర్వహించే కళాశాల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 83411 11687 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,442 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,692 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.51 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

ఏపీఆర్‌ సెట్‌ ప్రారంభం

తిరుపతి రూరల్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఏపీఆర్‌ సెట్‌ 2024–25 సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 కేంద్రాలు, తెలంగాణలో ఒక కేంద్రంలో పరీక్ష ప్రారంభమైనట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం 5,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, పరీక్ష 3, 4, 6, 7 తేదీల్లో 7 స్లాట్స్‌గా జరుగుతుందని తెలిపారు. మొత్తం 65 కోర్సులకుగాను ఈ పరీక్ష నిర్వహిస్తున్న ఈ పరీక్షను మహిళా వర్సిటీ వీసీ ఆచార్య వి.ఉమ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. పరీక్షకు తొలిరోజు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని ఆమె తెలిపారు. ఏపీఆర్‌ సెట్‌ 2025 కన్వీనర్‌ ఆచార్య ఉష, కోకన్వీనర్‌ ఆచార్య జాన్‌ సుష్మ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement