‘డయల్ యువర్ సీఎండీ’కి విశేష స్పందన
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీఎస్సీడీసీఎల్ తొలిసారిగా నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నవంబరు 3వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుపతి కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు సీఎండీ శివశంకర్ తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ‘డయల్ యువర్ సీఎండీ’కి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 87 మంది విద్యుత్తు వినియోగదారులు ఫోన్లు చేసి తమ సమస్యలను నేరుగా సీఎండీకి చెప్పుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, గృహాలపై వెళ్లే విద్యుత్ లైన్లు మార్పు, పాఠశాల ప్రాంగణంలో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, కాలిపోయిన/చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పులో జాప్యం, లో ఓల్టేజ్ సమస్యతో విద్యుత్ పరికరాలు కాలిపోవడం, ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంపు, లైన్లు, స్తంభాలు, కాలిపోయిన మీటర్‌ను మార్పు తదితర సమస్యలతోపాటు క్షేత్ర స్థాయిలో పనిచేసే పలువురు ఇంజినీర్లు, సిబ్బందిపై ఫిర్యాదులు చేశారు. విద్యుత్తు వినియోగ దారుల సమస్యలను తెలుసుకున్న సీఎండీ శివశంకర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వినియోగదారుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలన్న ఆలోచనతో ‘డయల్ యువర్ సీఎండీ’ని ప్రారంభించామన్నారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. నోడల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల నుంచి వచ్చిన సమస్యలను నోట్ చేసుకుని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేంత వరకు స్వయంగా పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్.జానకీరామ్, జె.రమణాదేవి, కె. ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్, జనరల్ మేనేజర్లు సీహెచ్ రామచంద్ర రావు, జి.చక్రపాణి, డి.సురేంద్రరావు, పి.భాస్కర్‌రెడ్డి, డి. జగదీష్, తిరుపతి సర్కిల్ ఎస్‌ఈ చంద్ర శేఖర్ రావు పాల్గొన్నారు.


