
వసూళ్ల పండగ!
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో టపాసుల దుకాణాలకు అమ్యామ్యాలు
అందినకాడికి దోచుకుంటున్న కూటమి నేతలు, అధికారులు
దీపావళిని కాసుల పండుగగా మార్చేసిన అగ్నిమాపకశాఖ
లంచం ఇవ్వకపోతే కొర్రీల పేరుతో ఇబ్బందులు
చిత్తూరులో తాత్కాలిక టపాసుల షాపులు
ఏర్పాటు చేస్తున్న వ్యవసాయమార్కెట్ స్థలం
చిత్తూరు కలెక్టరేట్ : దీపావళిని కూటమి నేతలు, అధికారులు కాసుల వసూళ్ల పండుగా మార్చేశారు. టపాసుల దుకాణాలకు నిబంధనలను పక్కాగా పాటించినా తమ చేతులు తపడకుంటే అనుమతులు జారీచేసేది లేదని అగ్నిమాపకశాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీపావళి సందర్భంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక దుకాణాల ఏర్పాటులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే.. దుకాణాల యజమానులు మాత్రం అడిగినంత లంచం ఇచ్చి అందినకాడికి దోచుకుందామనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రెండు జిల్లాల్లోనూ లంచాల పర్వం
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దాదాపు 283 వరకు తాత్కాలిక టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. టపాసుల విక్రయాల్లో మార్జిన్ 50 శాతం కంటే ఎక్కువగా ఉండడంతో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటుకు పోటీ పెరిగింది. నిబంధనలు పాటించకున్నా మామూళ్లు ఇస్తే ఏమైనా చేసుకోవచ్చని, ఏ రేట్లకై నా అమ్ముకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో ఇద్దరు అధికారులకు రెగ్యులర్ దుకాణాలకు ఒక్కొక్క ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లకు రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. తాత్కాలిక దుకాణాలకు ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో తాత్కాలిక టపాసుల దుకాణాలకు అనుమతులు కావాలంటే ప్రతి షాపునకు రూ.25 వేల చొప్పున స్థానిక కూటమి ప్రజాప్రతినిధికి ముట్టుజెప్పుకోవాల్సిందే. దీంతో పాటు అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులకు సైతం అదనంగా లంచం ఇచ్చుకుంటేనే అనుమతులు దక్కే పరిస్థితి నెలకొంది.
తనిఖీలు తూచ్
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగుతున్న అక్రమ టపాసుల వ్యాపారాలను అరికట్టడంతో పాటు అనుమతులు జారీచేస్తున్న ఆయా శాఖల్లో జరుగుతున్న లంచగొండుతనాన్ని అరికట్టడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాల్సిన అవసరం ఉంది. సేల్స్ ట్యాక్స్ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టపాసుల గోడౌన్‌లలో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి.. ఎంత మొత్తానికి ట్యాక్స్‌లు చెల్లించారు..? అన్న విషయాలను అధికారులు పట్టించుకోవడం లేదు.
టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకునే వారు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్, అగ్నిమాపక, శానిటేషన్, మున్సిపాలిటీ, నగరపాలక శాఖల నుంచి ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేప్టీ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అనుమతులను జారీచేస్తారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు, పుంగనూరుతో పాటు తిరుపతి జిల్లాలోని తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చంద్రగిరి, నాయుడుపేట, సత్యవేడు, వెంకటగిరిలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 40 వరకు తాత్కాలిక షాపులను పెడుతున్నారు. వీటన్నింటికీ అధికారుల నుంచి తాత్కాలిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తాత్కాలిక టపాసుల దుకాణాల ఏర్పాటుకు అందిన కాడికి దోచుకుంటున్నారు. లంచం ఇవ్వకపోతే ఏదో ఒక కారణంతో కొర్రీలు వేసి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
అనుమతి పేరుతో భారీగా వసూళ్లు