
భూరికార్డుల మార్పుపై ఒంటిపై డీజిల్ పోసుకుని నిరసన
బుచ్చినాయుడుకండ్రిగ : ఆన్‌లైన్‌లో భూ రికార్డులు మార్పు చేయడంపై తహసీల్దారు కార్యాలయంలోని చాంబర్ వద్ద బాధితుడు పాండురంగయ్య శుక్రవారం డీజిల్ పోసుకుని నిరసన తెలపడంతో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. మండలంలోని పల్లమాల గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 79–3లో తన తల్లి అనసూయమ్మ పేరున ఆన్‌లైన్‌లో 5 ఎకరాల భూమి ఉందన్నారు. దీన్ని తహసీల్దారు పల్లమాల గ్రామానికి చెందిన రవీంద్రబాబు పేరుతో ఈనెల 8వ తేదీన మార్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే అనుసూయమ్మ పేరున ఉన్న భూమిని రవీంద్రబాబు పేరుతో మార్చారని ఆరోపించారు. ఈ ఘటనపై తహసీల్దారు శ్రీదేవి స్పందిస్తూ పల్లమాల గ్రామానికి చెందిన గోవిందమ్మ పేరుతో 5 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్‌కు చెందిన పాండురంగయ్య గోవిందమ్మ పేరుతో ఉన్న భూమిని తన తల్లి అనసూయమ్మ పేరుతో ఆన్‌లైన్‌లో 2020లో మార్చుకున్నారని తెలిపారు. దీనిపై గోవిందమ్మ కొడుకు రవీంద్ర తనవద్ద ఉన్న రికార్డులతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు భూ రికార్డులను మార్చామని తెలిపారు.