
కుటుంబ కలహాలతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని కందాడ దళితవాడకు చెందిన సచివాలయ ఉద్యోగి కుటుంబ కలహాలతో గురువారం రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు. ఏర్పేడు మండలం కందాడ దళితవాడకు చెందిన బొంద మునెయ్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండవ కుమారుడు బొంద నిరంజన్(27) శ్రీకాళహస్తి మండలం బీవీపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కందాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యం, చంద్రికల కుమార్తె విద్యప్రియను నిరంజన్ ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ భార్య విద్యప్రియ గర్భిణి. పెళ్‌లైన తర్వాత కొంత కాలం సజావుగా జరిగిన వీరి కాపురం అత్తమామలు, భార్య వేధింపులకు తోడు అప్పులు ఎక్కువ కావడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిరంజన్ గురువారం రాత్రి గ్రామ శివారున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.
అమ్మా.. నాన్నా ఇక సెలవు..
మృతుడు నిరంజన్ వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను బట్టి అత్తమామలు, భార్య వేధింపులు, అప్పులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేఖలో.. ‘పోలీసు వారికి మనవి.. నాకు పెళ్‌లైనప్పటి నుంచి మా భార్య, వాళ్ల అమ్మ, హేమలత(పెద్దమ్మ) నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాభార్య కూడా నన్ను చంపేదాక తీసుకొచ్చారు. దానికి రిలేటెడ్‌గా కాల్‌డేటా తీయండి సార్.. దయచేసి నాకు న్యాయం చేయండి సార్.. వీళ్లు నన్ను టార్చర్ పెట్టి చంపేసి నా భార్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. మా అమ్మా,నాన్న, అన్న, వదిన, తమ్ముడును కాపాడండి సార్.. ‘అమ్మా.. నాన్నా సారీ నాన్నా.. ఇక సెలవు.. ఇంకో జన్మలో మిమ్మల్ని బాగా చూసుకుంటా..’ వాళ్లు నా దగ్గర చాలా అప్పులు చేయంచారు. నేను కట్టలేని అప్పులు చేపించారు. దయచేసి వీళ్లను వదలొద్దు అంటూ సూసైడ్‌నోట్‌లో నిరంజన్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో మృతుని భార్య, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.