
కోడి పందాల స్థావరంపై దాడి
వాకాడు: మండలంలోని కొండాపురంలో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఎస్‌ఐ నాగబాబు తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు పందెం రాయళ్లతోపాటు మూడు కోడి పుంజులు, వారి వద్ద ఉన్న రూ.1,200 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి సోమవారం కోర్డులో హాజరుపరచనున్నట్టు ఆయన వెల్లడించారు.
నేడు పాఠశాలలకు
కొత్త గురువులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1394 మంది నూతన టీచర్లు సోమవారం నుంచి కేటాయించిన బడుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదట్లో ఉద్యోగంలో చేరేటప్పుడు ఉండే ఉత్తేజం రిటైర్ అయ్యే వరకు కొనసాగించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నూతన అయ్యోర్లకు సూచించారు.
నేత్రదానం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో నివసిస్తున్న కావేరి పాకం పురుషోత్తం(46) బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆదివారం కన్నుమూశారు. మృతుడి నేత్రాలను ఆయన భార్య సుమలత దానం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ కంటి వైద్యశాల వారు నాయుడుపేటకు వచ్చి నేత్రాలను సేకరించుకుని వెళ్లారు. ఈ సందర్భంగా పురుషోత్తం కుటుంబీకులను పలువురు ప్రశంసించారు.
25న జీశాట్–7ఆర్
ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈనెల 25వ తేదీన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 16న ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక పరమైన కారణాలతో వాయిదా పడింది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే వాణిజ్య ఉపగ్రహం సైతం ప్రయోగించాల్సి ఉంది. ఆ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతోనే జీశాట్–7ఆర్ ప్రయోగం వాయిదాపడినట్లు సమాచారం. 2013 ఆగస్టు 30న ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్‌కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని తొలుత ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో రీప్లేస్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. షార్ కేంద్రంలోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ అనుసంధానం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.

కోడి పందాల స్థావరంపై దాడి