
ఇంజినీర్లపై కేసులు దారుణం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : రాష్ట్రాభివృద్ధి కోసం సైనికుల్లా పనిచేసిన పంచాయతీ ఇంజినీర్లపై కేసులు నమోదు చేయడం దారుణమని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ (ఏపీ పీఆర్‌ఏఈ) అధ్యక్షుడు కె.సంగీతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్‌లో ఏపీ పీఆర్‌ఏఈ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఇంజినీర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 619 సెక్షన్ ఆఫీసర్ల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. 3 వేల కోట్లు విలువైన ఉపాధి పనులు పూర్తి చేసినందుకు పంచాయతీ ఇంజినీరింగ్‌శాఖ అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద మూడుశాతం నగదు విడుదల చేయాలని కోరారు. డివిజనల్ డెవలప్‌మెట్ ఆఫీసర్స్ పోస్టులలో 30 శాతం పీఆర్ ఇంజినీర్లకు కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి పీఆర్ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. లేకుంటే డిసెంబర్ నుంచి దశలవారీగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సంఘం గౌరవాధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం జేఈలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పనిభారం తగ్గించేందుకు వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. పీఆర్ ఇంజినీర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారే కానీ, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. దీంతో అర్హులకు అవకాశాలు దక్కక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి బీడీ శ్రీనివాసరావు, జిల్లా జనరల్ సెక్రటరీ డి.చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ మహేష్, జనరల్ సెక్రటరీ అజయ్, యం.శంకరయ్య, టి.లీలాకృష్ణ, యం. లక్ష్మీపతి రెడ్డి, మధుసూదన్‌రావు పాల్గొన్నారు.