
దామినేడులో కార్డెన్ సెర్చ్
చంద్రగిరి : తిరుచానూరు సమీపంలోని దామినేడులో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ప్రధానంగా స్థానిక ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ సునీల్ కుమార్, నలుగురు ఎస్‌ఐలు, 9 మంది ట్రైనీ ఎస్‌ఐలు, సుమారు 60 మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి అందులో నివసించేవారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. అద్దె గదులలో ఉన్న వారి వివరాలను సైతం సేకరించారు.
వరుస చోరీల నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్
ఇటీవల తిరుపతి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్న క్రమంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వేకువజామున 4.30 నుంచి ఉదయం 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని వెల్లడించారు.. ఈ ఆపరేషన్‌లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే చోరీ కేసులో పరారీలో ఉన్న జోసెఫ్ అనే నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. కొత్త వ్యక్తులు కదలికలపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

దామినేడులో కార్డెన్ సెర్చ్