
ఆదాయముంటే చాలు!
తిరుపతి అర్బన్: చెప్పేదొకటి చేసేది మరొకటి అన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం. 13 రకాల ఆర్టీసీ సర్వీసులు ఉన్నప్పటికీ సీ్త్రశక్తి పథకానికి జిల్లాలో పల్లెవెలుగు సర్వీసులను మాత్రమే వినియోగిస్తున్నారు. అరకొర ఎక్స్‌ప్రెస్‌లను అక్కడక్కడా తిప్పుతున్నారు. అయితే రద్దీగా ఉండే సమయంలో తిరుపతి బస్టాండ్‌లో పల్లెవెలుగు సర్వీసులు లేకుండా ఆల్ట్రాడీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను ప్లాట్‌ఫాంలపై పెట్టేస్తున్నారు. పల్లెవెలుగు సర్వీసులు రావడానికి గంటకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు పల్లెవెలుగు సర్వీసులు లేవంటూ మరికొందరు డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చేసేది లేక మహిళలు కూడా ఆల్ట్రాడీలక్స్‌లు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ల్లో టిక్కెట్ కొనుగోలు చేసి జర్నీ చేయాల్సి వస్తోంది.
ఇది మరీ మోసం
తిరుపతి నుంచి కాణిపాకంకు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు తిరుపతి నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సప్తగిరి, ఆల్ట్రాడీలక్స్‌లు మాత్రమే తిరుపతి బస్టాండ్‌లోని కాణిపాకం ప్లాట్‌ఫాంపై ఉంచుతున్నారు. అలాగే సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు ప్రయాణికుల రద్దీ కాణిపాకానికి ఎక్కువ. ఆ సమయంలోనూ అదే పరిస్థితి. మిగిలినప్పుడు గంటకో రెండు గంటలకో ఓ పల్లెవెలుగు సర్వీసు అటొచ్చి ఇటు తళుక్కుమని వెళ్తుంది. మహిళలు సైతం టిక్కెట్లు చెల్లించి సప్తగిరి బస్సుల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఒక్క కాణిపాకం మార్గంలోనే కాదు.. రద్దీగా ఉండే శ్రీకాళహస్తి, ఇతర మార్గాల్లోనూ అద్దే పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులు ప్రయాణం చేయాల్సిన మార్గాల్లో ఇలాంటి పద్ధతులను అధికంగా ప్రయోగిస్తున్నారు.