
300 ఎకరాలు హాంఫట్!
కొత్తగా సర్వే నంబర్లు సృష్టించి స్వాహా
యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ
సహకరించిన రెవెన్యూ అధికారులు
చైన్నె వాసుల పేరుతో ఆన్‌లైన్‌లో
సైతం నమోదు
కంచే చేను మేసినట్టు సత్యవేడు మండలంలోని రెవెన్యూ అధికారులు వ్యవహరించారు. కాసులకు కక్కుర్తి పడి సుమారు 300 ఎకరాల అటవీ భూములను కబ్జాకోరులకు అప్పనంగా అప్పగించేశారు. తమిళనాడుకు చెందిన ఆరుగురి పేరిట వెబ్‌ల్యాండ్‌లోకి సైతం ఎక్కించేశారు. ఇందుకోసం కొత్తగా సర్వే నంబర్లను సృష్టించేశారు. ఇష్టారాజ్యంగా సబ్ డివిజన్లు నమోదు చేసి అక్రమార్కులకు హక్కులు కల్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద మొత్తంలో నగదు చేతులుమారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయా భూములను రీసర్వే చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని స్పష్టం చేస్తున్నారు.
సత్యవేడు : సత్యవేడు మండలంలోని వానెల్లూరు గ్రామంలో సుమారు 3 వందల ఎకరాల అటవీ భూమిని తమిళనాడు చెందిన ఆరుగురు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు కట్టబెట్టేశారు. వెబ్‌ల్యాండ్‌లో సైతం అక్రమార్కుల పేర్లను నమోదు చేయడంపై పోలీసులకు తహసీల్దార్ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. వివరాలు.. గ్రామ సమీపంలోని 300 ఎకరాలు 2024 వరకు అటవీ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో ఉండేది. ఇందులో ఫారెస్ట్ అధికారులు జీడిమామిడి, నీలగిరి చెట్ల పెంపకం సైతం చేపట్టారు.
నూతనంగా సబ్ డివిజన్లు
వానెల్లూరులోని సర్వే నెంబరు 197/1లో 252 ఎకరాలు , 200/1లో 49–88 ఎకరాలు అటవీ భూమిగా ఉంది. దీనిపై చైన్నె వాసులు కొందరు కన్నేశారు. 2024 జూన్‌లో రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క రికార్డులను తారుమారు చేశారు. సర్వే నెంబరు 197/1లో శ్రీధరన్ పేరుతో 50.34 ఎకరాలు, 197/బీలో అమృతవర్షిణి పేరుతో 50.34 ఎకరాలు, 197/1సీలో నవీన్ రాజ్‌కన్న పేరుతో 50.34 ఎకరాలు, 197/డీలో అనూరాధ జైకుమార్ పేరుతో 50.34 ఎకరాలు, 197/ఈలో అతా జైకుమార్ పేరుతో 50.34 ఎకరాలు, 197/1ఎఫ్‌లో ఆశసురేష్ పేరుతో 34 సెంట్లను రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లోకి ఎక్కించేశారు. ఈ మేరకు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసేశారు. ఇందుకోసం 197/1 సర్వే నంబరును తమిళనాడు వాసుల కోసం సబ్ డివిజన్‌లుగా మార్చేశారు. ఈ మేరకు అప్పట్లో తహసీల్దార్‌గా పనిచేసిన రామాంజులునాయుడు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులతో చేతులు కలిపి భూ ఆక్రమణకు సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు
వానెల్లూరు అటవీ భూమిని నాలుగు సబ్ డివిజన్లు విభజించి తమిళనాడుకు చెందిన ఆరుగురి పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ రాజశేఖర్ తెలిపారు. వివాదాస్పద భూములపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామని, వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ మేరకు సత్యవేడు సీఐ మురళీనాయుడు కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
ఆక్రమిత భూమిలో నీలగిరి చెట్లు
ఆ భూములు మావే..
అటవీ భూముల విషయమై ఆక్రమణదారులకు సంబంధించి వారు వివరణ ఇచ్చారు. సర్వే నెంబరు 197/1లోని 300 ఎకరాల భూమిని ముత్తు కుమారస్వామి అయ్యర్ అనే వ్యక్తి చాలా ఏళ్ల క్రితం టీటీడీ నుంచి పొందారని చెప్పారు. అయన వారసుల నుంచి తాము కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఫారెస్టు రేంజర్ త్రినాథ్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ.. అటవీ శాఖ చట్టం ప్రకారం 1972లో ఈ భూమి రక్షిత అటవీ భూమిగా గెజిట్ అయినట్లు వివరించారు. ఇటీవల రెవెన్యూ, అటవీశాఖ చేపట్టిన జాయింట్ సర్వేలో సైతం ఇది ఫారెస్ట్ ల్యాండ్‌గానే నమోదైనట్లు తెలిపారు.
రీసర్వే చేయాలి
వానెల్లూరు సమీపంలోని ఈ భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. చైన్నె వాసులు కట్టుకథలు అల్లుతున్నారని, విలువైన భూములను కాజేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయా భూములను రీసర్వే చేస్తే నిజాలు బయటపడతాయని వెల్లడిస్తున్నారు.

300 ఎకరాలు హాంఫట్!