
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సమస్యలను అర్జీల రూపంలో అందించి పరిష్కరించుకోవాలని సూచించారు.
వ్యక్తిత్వ వికాసంపై అవగాహన
తిరుపతి సిటీ : శ్రీచైతన్య విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఝాన్సీలక్ష్మీ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై అధ్యాపకులు, టెక్నో స్కూల్ టీచర్లు, బోధనేతర సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆదివారం ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారికి క్రమశిక్షణ అవసరమని వెల్లడించారు. శ్రీచైతన్య చిన్న సంస్థగా మొదలైందని, నేడు ఆసియాలోని అతిపెద్ద విద్యాసంస్థగా ఎదిగిందని వివరించారు. నేను అనే భావనతో కాకుండా, మేము అని పనిచేస్తే ప్రగతి పథంలో పయనించవచ్చని తెలిపారు. శ్రీచైతన్యలోని ప్రతి విద్యార్థి కలను సాకారం చేసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కాలేజీల ఏజీఎం బీవీ ప్రసాద్, పాఠశాలల ఏజీఎం సురేష్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,571 మంది స్వామివారిని దర్శించుకోగా 36, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
నేటి నుంచి
రెండో విడత అడ్మిషన్లు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ విద్యాసంస్థలలో రెండో విడత అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఓఏమ్‌డీసీ నుంచి విద్యార్థుల మొబల్ ఫోన్లకు సమాచారం అందించారు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు రెండు రోజులోపు ఆయా కళాశాలలో తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం మరో రెండు రోజుల తర్వాత ఆయా కళాశాలలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.