
రైల్వే డివిజన్ మన హక్కు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుకోవడం మనందరి హక్కు దీని కోసం ఉద్యమిద్దాం అంటూ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో బాలాజీ రైల్వే డివిజన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1990లో వచ్చిందన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాయ అసమానతలు తలెత్తకుండా రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. 35 ఏళ్ల కలను సాకారం చేసుకునే దిశగా పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు మాట్లాడుతూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రానికి పెద్దసంఖ్యలో తరలివచ్చే ప్రయాణికులకు రైల్వే డివిజన్ ఏర్పాటుతో వసతులు కల్పించవచ్చని తెలిపారు. మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైల్వే అనుసంధాన వ్యవస్థ, వాణిజ్యం, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు డివిజన్ దోహదం చేస్తుందన్నారు. డిప్యూటీ మేయర్ మునికృష్ణ మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ కోసం ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని వెల్లడించారు. నవీన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే తిరుపతికి రైల్వే డివిజన్ పొందే అర్హతలు ఉన్నాయని వివరించారు. రాజకీయ ఒత్తిడితోనే బాలాజీ డివిజన్ ఆశలను తుంగలో తొక్కి గుంటూరు డివిజన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ మాజీ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, పీసీ రాయల్, బీమ్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్, చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ చౌదరి, న్యాయవాది దినకర్, నేతలు మహీధర రెడ్డి, శ్రీధర్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, కుప్పాల నీలిష్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కుప్పాల గిరిధర్ కుమార్

రైల్వే డివిజన్ మన హక్కు