
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
తడ : పులికాట్ సరస్సులో ఇరకం దీవి వద్ద సోమవారం ప్రమాద వశాత్తు పడవలో నుంచి జారిపడి గల్లంతైన బాలుడు హేమరాజ్ (17) మృత దేహం మంగళవారం లభ్యమైంది. వివరాలు.. చైన్నెలోని ఎన్నూరు జార్ల కుప్పానికి చెందిన హేమరాజ్ శనివారం ఇరకంలో జరుగుతున్న తిరునాళ్ల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సోమవారం తాత ఆర్ముగంతో కలిసి పడవలో వెళుతుండగా జారి సరస్సులో పడి పోయాడు. గ్రామంలోని జాలర్లు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం బాలుడి మృతదేహం పైకి తేలడంతో ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెబ్ కౌన్సెలింగ్‌కు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీలో అర్హత సాధించిన నూతన టీచర్లకు వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో సూచించిన ఖాళీల మేరకు వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లోనే వెబ్‌ఆప్షన్‌లు నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. చిత్తూరు విద్యాశాఖలో పనిచేస్తున్న ఏడీ–2తో పాటు మరికొంత సిబ్బంది విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో గత రెండు రోజులుగా వెబ్‌కౌన్సెలింగ్ కసరత్తు చేపడుతున్నారు. బుధవారం వెబ్‌కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 9, 10 తేదీల్లో వెబ్‌కౌన్సెలింగ్ పూర్తి చేసి ఈ నెల 13న కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా కసరత్తు నిర్వహిస్తున్నారు.
నేటి నుంచి దివ్యాంగులకు వైద్య పరిశీలన
తిరుపతి అర్బన్: దివ్యాంగులు, వ్యాధిగ్రస్తుల పింఛన్లపై బుధవారం నుంచి వైద్యులు పరిశీలన చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డీఓలు, డీఎంహెచ్‌ఓ, పీసీహెచ్‌ఎస్, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్లు, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్, శ్రీకాళహస్తి, గూడూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లు, డీఆర్‌డీఏ పీడీతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ల తొలగింపు నోటీసు అందుకున్న వారిలో 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకున్నవారిని మరోసారి వైద్యులు పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చేవారికి తాగునీటితోపాటు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రికి రాలేని వ్యాధిగ్రస్తుల కోసం104, 108 వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు అధికారులతో సచివాలయ ఉద్యోగులు సమన్వయం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.