
ప్లకార్డులు చేతపట్టి.. పింఛన్లు పంచిపెట్టి!
సామాజిక పెన్షన్ల పంపిణీలోసచివాలయ ఉద్యోగుల నిరసన కూటమి ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం జిల్లావ్యాప్తంగా నల్లబాడ్జీలు ధరించి విధులు
మహోన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకారణంగా కక్షగట్టి వేధింపులకు గురిచేస్తోందని మండిపడుతున్నారు. సర్కారు వైఖరికి నిరసనగా బుధవారం నుంచి సమ్మె బాట పట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు నోటీసులు సైతం అధికారులకు అందించారు. అయితే పేదలను ఇబ్బంది పెట్టకూడదనే సదుద్దేశంతో సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈక్రమంలోనే ప్లకార్డులను చేతపట్టి తమ ఆందోళనను వెలిబుచ్చారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. పాలకులు పెడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేశారు.
తిరుపతి అర్బన్ : సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కొంతకాలంగా పోరాటం సాగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. అయితే పింఛన్ల ప్రక్రియ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బుధవారం నల్లబాడ్జీలను ధరించి ప్లకార్డులను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ విధులు నిర్వర్తించారు. ఈవిషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నినాదాలు చేస్తూనే..
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సచివాలయ ఉద్యోగులు నినాదాలు చేస్తూనే పింఛన్లు పంపిణి చేశారు. ఈ క్రమంలో డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లె మండలాల్లో బుధవారం ఉదయం 10గంటల తర్వాత పింఛన్ల ప్రక్రియ మొదలుపెట్టారు. అలాగే పుత్తూరు, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటి పరిధిలోను 10 గంటలపైన పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణి మొదలుపెట్టాల్సి ఉంది. అయితే సచివాలయ ఉద్యోగులు పోరుబాట వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఆలస్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం గంటల కొద్ది పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీనిపై డీఆర్‌డీఏ అధికారులతోపాటు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లుకు సమాచారం అందడంతో వారు సచివాలయ ఉద్యోగులను బుజ్జగించి పెన్షన్ల పంపిణీకి పంపినట్లు తెలిసింది.
పనిభారం తగ్గించాలి
పనిభారం తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వలంటీర్ల పనులు అప్పగించడంపై మండిపడుతున్నారు. సర్వేలతో సతమతమవుతుంటే జీఎస్టీపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్లకార్డులను చేతపట్టుకుని నిరసన తెలియజేశారు.
మూడో స్థానానికి..
సెప్టెబర్‌లో పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే సచివాలయ ఉద్యోగుల నిరసన కారణంగా ఈ నెల తొలిరోజు 94.81శాతం మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేశారు.దీంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలోకి జారింది.

ప్లకార్డులు చేతపట్టి.. పింఛన్లు పంచిపెట్టి!

ప్లకార్డులు చేతపట్టి.. పింఛన్లు పంచిపెట్టి!

ప్లకార్డులు చేతపట్టి.. పింఛన్లు పంచిపెట్టి!