
మట్టి.. కొల్లగొట్టి
కొట్ర మంగళం చెరువులో
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
రోజుకు 300 ట్రిప్పుల వరకు మట్టి రవాణా
చెరువు కట్ట తొలగించి రహదారి ఏర్పాటు
వర్షాకాలం సమీపిస్తుండటంతో స్థానికుల భయాందోళన
చోద్యం చూస్తున్న అధికారులు
సాక్షి టాస్క్ ఫోర్స్: జిల్లా కలెక్టర్ పరిపాలన భవనం వెనుక కూతవేటు దూరంలో ఉన్న కొట్ర మంగళం చెరువులో ఇష్టారాజ్యంగా మట్టి కొల్లగొడుతున్నారు. నేషనల్ హైవే పేరుతో అనుమతులు ఉన్నాయంటూ రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లతో అక్రమంగా మట్టి రవాణా చేసి దోచుకుంటున్నారు. చెరువులో సుమారు 20 నుంచి 30 అడుగుల లోతు వరకు గుంతలను తవ్వేశారు. కలెక్టర్ కార్యాలయానికి అతి చేరువలో ఇంత జరుగుతున్న అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. మట్టి రవాణా చేసేందుకు చెరువు కట్టను తొలగించి చెరువులో నుంచి హైవే మీదకు దారి ఏర్పాటు చేసుకొని మట్టి రవాణా చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమార్కులకు అధికారుల అండ
మట్టి తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఎవరు వెళ్లి అడిగినా ఇరిగేషన్ అధికారుల అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. ఏ అనుమతులు ఉన్నాయి? ఎవరిచ్చారు అంటే సమాధానం చెప్పడం లేదు. రెవెన్యూ అధికారులు సైతం ఇరిగేషన్ అధికారుల అనుమతితోనే మట్టి తవ్వకాలు చేస్తున్నారని చెప్పడం గమనార్హం.
దర్జాగా రవాణా
రాత్రీ, పగలు తేడా లేకుండా టిప్పర్లతో రోజుకు వందల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. నిజంగానే ఇరిగేషన్ అధికారులు హైవే అవసరం కోసం అనుమతు లు ఇచ్చారా? ఇస్తే ఎంత వరకు అనుమతి ఇచ్చారనేది గందరగోళంగానే ఉంది. అధికారులు పర్యవేక్షిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. హైవే పేరుతో ప్రైవేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక కూటమి నేతలకు మామూళ్లు
స్థానిక అధికార పార్టీ కూటమి నాయకులకు మట్టి తరలించే వ్యక్తులు మామూళ్లు ముట్టజెబుతుండడంతో అధికారులు వారిని ఇబ్బంది పెట్టకుండా కూటమి నాయకులు చూసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కూటమి నాయకుల ఒత్తిడి వల్లే చెరువుల్లో మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా నోరు మెదపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో పక్కనే ఉన్న తూకివాకం చెరువులో స్థానిక కూటమి నాయకుడికి మామూళ్లు ఇవ్వలేదని పనులు నిలిపేశారు. అందువల్లే ప్రస్తుతం కూటమి నాయకులకు మామూళ్లు ముట్టజెప్పి యథేచ్ఛగా మట్టిని దోపిడీ చేసి రూ.లక్షలు దోచుకుంటున్నారు.

మట్టి.. కొల్లగొట్టి