
ఆయన కృషితోనే నైలెట్
ఉపాధి అవకాశాల కోసం ఎంపీ వీరోచిత పోరాటం ఎట్టకేలకు ఎస్వీయూ నైలెట్ సంస్థ ఏర్పాటు అడుగులు వసతులు పరిశీలించిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి సిటీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (నైలెట్) తిరుపతి కేంద్రాన్ని అక్టోబర్ 2న ప్రారంభించనున్న నేపథ్యంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం ఆ కేంద్రాన్ని సందర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైలెట్ ఏర్పాటుకు ఎంపీ పార్లమెంట్ వేదికగా పలుమార్లు గళం విప్పి సాధించారు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ చేసిన ప్రయత్నాల ఫలితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నైలెట్ కేంద్రం ఎస్వీయూలో ఏర్పాటు కానుంది.
యువత ఉపాధే లక్ష్యంగా..
యువతకు పుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి నిరుద్యోగ అభ్యర్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎంపీ గురు మూర్తి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నైలెట్ సంస్థను ఎస్వీయూలో ఏర్పాటు చేసేందుకు నిరంతర కృషి చేశారు. దీంతో ఈ సంస్థ ద్వారా యువతకు విభిన్న కో ర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ కోర్సుల తో పాటు వెబ్ డిజైనింగ్, పీసీ హార్డ్‌వేర్ అండ్ నెట్ వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ వంటి తక్కువ వ్యవధి కోర్సులు అందించనున్నారు. తిరుపతి ప్రాంత యువతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎంబీడెడ్ సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్, సెమి కండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
నైలెట్‌ని సందర్శించిన ఎంపీ
ఎస్వీయూలో ఏర్పాటు చేసిన నైలెట్ సంస్థను సందర్శించిన ఎంపీకి నైలెట్ డైరెక్టర్ అధ్యాపక సిబ్బందిని పరిచయం చేశారు. అనంతరం ఆయన క్లాస్ రూమ్స్‌ని, ల్యాబ్స్‌ని పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్న విషయం గమనించిన ఎంపీ దాని గురించి ఆరా తీయగా మరుగుదొడ్ల ఇబ్బంది కారణంగా ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. వెంటనే యూనివర్సిటీ వీసీతో మాట్లాడిన ఎంపీ సమస్య త్వరగా పరిష్కరించాలని కోరారు. ఫలితంగా నైలెట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ప్రపంచ పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా..
ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాటి నైలెట్ సంస్థను సాధించాం. యువతకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ అవసరాలకు తగినట్లు వారి నైపుణ్యాన్ని పెంపొందించి, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు పొందేలా నైలెట్ కీలక పాత్ర పోషించనుంది. స్థానికంగానే ఆధునిక సాంకేతిక శిక్షణ పొందే అవకాశాలు లభించడం వల్ల యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి. ఈ కేంద్రం ద్వారా ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందించనున్నారు. నైలెట్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాం.
–ఎం గురుమూర్తి, ఎంపీ, తిరుపతి