
తిరుమలలో క్యూలన్నీ ఖాళీ
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 63,837 మంది స్వామివారిని దర్శించుకోగా 20,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.85 కోట్లు సమర్పించారు. క్యూలోకి వచ్చిన భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.
ప్రమాణాలు లేని ‘ప్రొఫెనోఫాస్’
తిరుపతి అర్బన్ : ట్రాపికల్ అగ్రో సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైన్నె వారు తయారు చేసిన ప్రొఫెనోఫాస్ 40 శాతం ఈసీ, సైపర్ మెథ్రిన్ 4శాతం ఈసీ, బ్యాచ్ నెంబర్ టీఏసీబీ 250146, ట్రేడ్ పేరు పటక్ తో ఉన్న పురుగుమందులను రైతులు వాడకూడదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రామాణిక పరీక్షల్లో నిర్ధారిత ప్రమాణాలతో ఈ పురుగు మందులు లేవని గుంటూరు వ్యవసాయ సంచాలకులు స్పష్టం చేసినట్లు వెల్లడించారు.
ఉప రాష్ట్రపతికి
ఘన స్వాగతం
తిరుపతి అర్బన్ : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆయన రేణిగుంటకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎక్స్‌అఫిషియో, రెవెన్యూ సెక్రటరీ హరి జవహర్‌లాల్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఐజీ రవిప్రకాష్, విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీష్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తదతరులు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
మట్టి తరలింపునకు చెక్
చిట్టమూరు : అక్రమంగా సాగిస్తున్న మట్టి తరలింపునకు అధికారులు బుధవారం చెక్ పెట్టారు. వైఎస్సార్‌సీపీ సాను భూతి పరుడు వల్లిపి మల్లికార్జున భూమిలో కొందరు అక్రమార్కు లు మట్టిని తవ్వేసి తరలించి సొమ్ము చేసుకుంటుంన్నారు. దీనిపై సాక్షి పత్రికలో ‘కక్షగట్టి.. కడుపుకొట్టి’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై తహసీల్దార్ నరేష్ స్పందించారు. వెంటనే మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని వీఆర్‌ఓ శివయ్యను ఆదేశించారు. ఈ మేరకు వీఆర్‌ఓ ఘటనాస్థలానికి వెళ్లి జేసీబీ, ట్రాక్టర్‌ను పంపించేశారు.
పిల్లలు.. వృద్ధులకు ‘జియో ట్యాగ్’
తిరుమల: తిరుమలలో పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా డిజిటల్ జియో ట్యాగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. బుధవారం ఈ మేరకు ఎస్సీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 20,350 మందికి ట్యాగ్‌లు కట్టారు. ట్యాగింగ్ కారణంగా పిల్లలు, వృద్ధులు తప్పిపోతే వెంటనే గుర్తించేందుకు సాధ్యమవుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే బుధవారం తప్పిపోయిన ఏడుగురు వృద్ధులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తిరుమలలో క్యూలన్నీ ఖాళీ