
‘న్యాయమిత్ర’ అమలుకు డిమాండ్
తిరుపతి లీగల్ : ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా అఖిల భారత న్యాయవాదుల సంఘం కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి కోర్టు ఆవరణలో డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గతంలో వైఎస్సార్‌సీపీ న్యాయమిత్ర పథకం కింద అందిస్తున్న రూ.5వేలను పెంచి రూ.10వేలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అలాగే లబ్ధిదారుల సంఖ్య 2,670 నుంచి 3,500లకు పెంచుతామని మాట ఇచ్చారని వెల్లడించారు. రూ.100 కోట్లతో న్యాయవాదుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామని, రూ.5లక్షల ఆరోగ్య భీమా, రూ.15 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని ప్రకటించారని వివరించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా న్యాయమిత్ర పథకానికే దిక్కులేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హేమ చంద్రారెడ్డి, కార్యదర్శి పి.మురళి, కార్యవర్గ సభ్యులు దేవరాజులు, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.