తిరుమల: మల్టీ పర్పస్ క్లీనింగ్‌కు ఉపయోగించే రూ.20 లక్షల విలువైన రైడ్ ఆన్ స్వీపర్ మెషీన్లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు టీటీడీకి ఆదివారం విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి బ్యాంకు తిరుపతి జీఎం పత్రి శ్రీనివాస్ అందజేశారు. డిప్యూటీ ఈఓ సోమన్నారాయణ, ఆరోగ్యాధికారి డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు.
గల్లంతైన రైతు మృతదేహం లభ్యం
పెళ్లకూరు : స్వర్ణముఖినదిలో గల్లంతైన రైతు చమర్తి పాపాయ్య(65) మృతదేహం ఆదివారం దిరసనమాల సమీపంలో లభ్యమైంది. పాపయ్య శనివారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు నదిని దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి స్థానికులు రోజంతా గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో దిరసనమాల వద్ద నదీతీరంలో ముళ్ల చెట్టుకు చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
వెంకటగిరి రూరల్ : గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ మేరకు సీఐ ఏవీ రమణ వివరాలు వెల్లడించారు. కేరళకు చెందిన ఆర్.జీనోజ్ అనే వ్యక్తి గంజాయితో విజయవాడ నుంచి రైలులో తిరుపతి బయలుదేరాడు. శనివారం ఉదయం వెంకటగిరి రైల్వేస్టేషన్‌లో దిగేశాడు. గంజాయిని సేవించి ఆ మత్తులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.