
అమావాస్య గ్రామోత్సవం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో అమావాస్య సందర్భంగా ఆదివారం స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించి, పంచ హారతులు సమర్పించారు. అనంతరం మేళ తాళాలు, వేదమంత్రాల మధ్య స్వామి, అమ్మవారు పురవీధుల్లో ఊరేగారు.
త్వరలో మరో ‘వందేభారత్’
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి మీదుగా మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విజయవాడ–బెంగళూరు మధ్య నడిచే ఈ సర్వీసు తిరుపతి మీదుగా రాకపోకలు సాగించేలా రూట్ ఖరారు చేశారు తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు, కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. దీపావళి రోజున ఈ రైలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలులో మొత్తం 8 బోగీలు ఉంటాయి. 7 ఏసీ చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఉంటుంది. ఈ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు మొదలై, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది.